ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై సుప్రీం తీర్పు చెంప పెట్టు

న్యాయ వ్య‌వ‌స్థ , శాస‌న వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వ‌స్తోంది. లేక‌పోతే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ ప‌రంగా స్పీక‌ర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి ప‌ట్ల గౌర‌వంతోనే వెన‌క్కి త‌గ్గాల్సి వ‌స్తోంది. రాజ‌కీయ ప‌రంగా ఫిరాయింపులు అనేవి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. ఇవి రాను రాను బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ తీసుకు వ‌చ్చేలా చేస్తాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న వారు జ‌వాబుదారీగా ఉండాలి. అంత‌కంటే ఎక్కువ‌గా ఆద‌ర్శ ప్రాయంగా ఉండాలి. ప‌ద‌వి అనేది ప్రోటోకాల్ కోస‌మో లేక అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం కోస‌మో కాదు. ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి బాధ్య‌తాయుతంగా ఉండాల‌ని గుర్తించాలి. ఇది ఒక్క తెలంగాణ‌లోని ప్ర‌జా ప్ర‌తినిధుల‌కే కాదు యావ‌త్ దేశంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ( అసెంబ్లీ, లోక్ స‌భ‌, రాజ్య స‌భ‌, శాస‌న మండ‌లి) ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రతి ఒక్క‌రికీ వ‌ర్తిస్తుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

దేశానికి దిశా నిర్దేశం చేసే వ్య‌వ‌స్థ ప్ర‌జాస్వామ్యం. అది కూడా నిర్వీర్య‌మై పోతే శాసన వ్య‌వ‌స్థ నీరు గారి పోయే ప్ర‌మాదం ఉంది. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు గురుత‌ర‌మైన బాధ్య‌త ఉంటుంద‌న్న సోయి లేక పోతే ఎలా అని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం రోజు రోజుకు దిగ‌జారి పోతున్న రాజ‌కీయ విలువ‌ల‌ను తెలియ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, ప్రకాశ్‌గౌడ్‌లు ఉన్న‌ట్టుండి పార్టీని కాద‌ని అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకున్నారు. ఆపై ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీఆర్ఎస్ ను , ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను అన‌రాని మాట‌లు అన్నారు. ఇదే స‌మ‌యంలో త‌మ పార్టీకి రాజీనామా చేయ‌కుండా ఎలా ఎమ్మెల్యేలుగా కొన‌సాగుతారంటూ బీఆర్ఎస్ ప్ర‌శ్నించింది. ఆ మేర‌కు హైకోర్టులో ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరింది. నాన్చుడు ధోర‌ణి అవ‌లంభించ‌డంతో దీనిని స‌వాల్ చేస్తూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డిలు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు.

జూలై 31న సుప్రీంకోర్టులో సుదీర్ఘ‌మైన వాద‌న‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా సీజేఐ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ తో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. త‌క్ష‌ణ‌మే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా న్యాయ వ్య‌వ‌స్థ శాస‌న వ్య‌వ‌స్థ‌ను ఆదేశించ లేద‌ని, అందుకే స్పీక‌ర్ కు విశిష్ట అధికారాలు ఉన్న‌ప్ప‌టికీ ఫిరాయింపు అనేది అప్ర‌జాస్వామిక‌మ‌ని, ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో తాము మ‌రోసారి పిటిష‌న్లు దాఖ‌లు చేయాల‌ని చూసినా లేదా ఆల‌స్యం జ‌రిగినా చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు జ‌స్టిస్ గ‌వాయ్. ఇందు కోసం మూడు నెల‌ల పాటు స‌మ‌యం ఇవ్వ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం జ‌రిగింద‌ని, ఇలా వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తూ పోతే ఫిరాయింపుదారులు పెరిగి పోతార‌ని, చ‌ర్య‌లు తీసుకోక పోతే వారు రెచ్చి పోయే ప్ర‌మాదం ఉంద‌ని , చివ‌ర‌కు డెమోక్రసీకి అర్థం లేకుండా పోతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో రాజకీయ ఫిరాయింపులు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గత పార్లమెంటరీ చర్చలు, కిహోటో హోల్లోహన్ తీర్పును ఉటంకిస్తూ, స్పీకర్ అనర్హత పిటిషన్లను వెంటనే నిర్ణయించాలని, ఆలస్యం జరగకుండా ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు నవంబర్ 22, 2024 నాటి డివిజన్ బెంచ్ ఆదేశాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టి, అన్ని అనర్హత చర్యలను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను పొడిగించడానికి ఏ ఎమ్మెల్యేను అనుమతించ రాదని, అలాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే స్పీకర్ నుండి ప్రతికూల నిర్ణయాలను ఆహ్వానించవచ్చని కూడా హెచ్చరించింది. ఈ సంద‌ర్భంగా జస్టిస్ బీఆర్ గ‌వాయ్ ఆపరేషన్ విజయవంతమైంది కానీ రోగి మరణించాడు అనే పరిస్థితిని అనుమతించలేమని గమనించి, పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి షెడ్యూల్‌ను నిర్ణయించాలని స్పీకర్‌కు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సింది స్పీక‌ర్ పైనే ఉంటుంది. వీరిపై అన‌ర్హ‌త వేటు వేస్తే ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తారా లేక శాస‌న వ్య‌వ‌స్థ‌పై న్యాయ వ్య‌వ‌స్థ పెత్త‌నం ఏమిటి అంటూ మ‌రోసారి వాయిదా ప‌ద్ద‌తిని అనుస‌రిస్తారా అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ తీర్పు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే వారికి , ఉన్న ప‌ళంగా అధికారం , ప‌ద‌వీ వ్యామోహంతో గోడ‌లు దూకే వారికి చెంప పెట్టు లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *