కేసీఆర్ జీవితం స్పూర్తి దాయకం
రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే వేడుకలు
హైదరాబాద్ – కేసీఆర్ మామూలోడు కాదని, ఆయన సమర్థవంతమైన నాయకులలో ఒకరుగా ఇప్పటికే గుర్తింపు పొందారని కొనియాడారు మాజీ మంత్రి , తనయుడు కేటీఆర్. శనివారం బీఆర్ఎస్ పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ 70వ జయంతి. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు కేటీఆర్. ఈ వేడుకలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగించారు.
చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆనాడు ఒక్కడై ఒంటరి పోరాటం చేశాడని, ఆ తర్వాత సకల జనులు తనతో కలిసి వచ్చారని చెప్పారు.
ఒకవేళ కేసీఆర్ గనుక తన పదవికి రాజీనామా చేయక పోయి ఉండి ఉంటే , ఉద్యమానికి శ్రీకారం చుట్టక పోయి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు కేటీఆర్. చరిత్ర తెలియని వాళ్లు, ఆనాటి పోరాటంలో పాలు పంచుకోని వాళ్లు నీతి లేని మాటలు మాట్లాడుతున్నారని అయినా కేసీఆర్ ఆకాశం లాంటోడన్నారు. ఆయనకు తిరుగే లేదన్నారు.