సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. దాడులు, అల్లర్లు, విధ్వంసాలను తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ప్రోత్సహించదని అన్నారు. మరీ ముఖ్యంగా అభివృద్ధికి బ్రాండ్ గా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సలు ప్రోత్సహించరని స్పష్టం చేశారు.. రెండు రోజుల క్రితం అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని తమ పార్టీ నాయకులు వాళ్ల ఇంటికి వెళ్లి డిమాండ్ చేస్తే.. దానిని దాడిగా వైసీపీ క్రియేట్ చేసిందన్నారు.. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని మా పార్టీ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు సైతం తీవ్రంగా ఖండించారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో హింసా రాజకీయాలకు, కక్ష సాధింపులకు తావు లేదన్నారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారిపైనే 31 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ తన మంది మాలబల్యంతో గుంటూరు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ జంగిల్ రాజ్ మాదిరి ప్రవర్తించాడని ఆరోపించారు అచ్చెన్నాయుడు. వైసీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రయాణం సాగించారని అన్నారు. బెంగళూరు ప్యాలస్ కు పరిమితమైన జంగిల్ రాజ్… నేడు గుంటూరుకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఉల్లంఘిస్తూ.. సాక్షి మీడియాకు ఫోజులు ఇస్తూ.. బూతుల నేత ఇంటికి పరామర్శకు బయల్దేరడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎంగా పని చేసిన జగన్మోహన్ రెడ్డి.. బూతుల నేతలకు చీవాట్లు పెట్టాల్సింది పోయి.. వారికి సంఘీభావం తెలపడాన్ని జనం జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.






