గులాబీతో కమలం దోస్తీ అబద్దం
ఖండించిన గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదే పదే బీఆర్ఎస్ ,బీజేపీ కలుస్తున్నాయని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయంటూ వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఇలాంటి ప్రచారం వల్ల పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులు గందరగోళానికి గురవుతాయని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో రాజకీయాలు మరింత దిగజారి పోయాయని వాపోయారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం మానుకోవాలని సూచించారు. ఇప్పుడు కాదు ఎప్పటికీ బీజేపీ , బీఆర్ఎస్ తో కలిసి పోవని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచేందుకు తాము ప్లాన్ చేస్తున్నామని , ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామని, రాష్ట్రంలో 17 సీట్లు తాము కైవసం చేసుకుంటామన్న నమ్మకం తనకు ఉందన్నారు కిషన్ రెడ్డి.