
కూటమి సర్కార్ పై జగన్ రెడ్డి కామెంట్స్
అమరావతి : ఏపీలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , మరో వైపు తాము తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పేదలు, నిమ్న వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రూ. 4,900 కోట్లు బకాయిలు పడ్డాయని ఇప్పటి వరకు వాటిని మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. కేవలం రూ. 900 కోట్లు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారని మండిపడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయన్నారు. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరి పోయాయని ఆరోపించారు. గోరుముద్ద నాశనం అయ్యిందన్నారు. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగి పోయిందంటూ ఎద్దేవా చేశారు. సీబీఎస్‌ఈని రద్దు చేశారని, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు జగన్ రెడ్డి. స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు పని చేయక పోవడం వల్ల నీళ్లు అందక పిల్లలు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉందన్నారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారని, ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారని ఫైర్ అయ్యారు.