ఉద్యోగులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులు తమ సమ్మె విషయంపై పునరాలించు కోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు మహా లక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు ఉనికికే ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టీసీ, ప్రస్తుతం 90కి పైగా డిపోలు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం ఈ మూడు అంశాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రభుత్వ విలీనంపై సంస్థ , ఉద్యోగుల అంశాలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు.
ప్రస్తుతం ఆర్టీసీ క్రమంగా కోలుకుంటున్న సమయంలో సమ్మె నిర్ణయం సరైంది కాదని, ఇది సంస్థకు , ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో రూ.1205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లుగా ఉన్న CCS బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని చెప్పారు. ఇప్పటి వరకు 2978 కొత్త బస్సులను ప్రవేశ పెట్టడంతో పాటు, 1134 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే వారు విధుల్లోకి రానున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.





