
అస్సాం నగరం జన సంద్రంగా మారింది దుఖఃంతో. తమ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మరణం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా చేసింది. అశేష జనవాహిని తనకు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హజారికా గుర్తుకు వస్తారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు జుబీన్ గార్గ్. సామాజిక మాధ్యమాలన్నీ తనతో నిండి పోయాయి. తన అద్భుతమైన గాత్రంతో ప్రజల గొంతుకను వినిపించే ప్రయత్నం చేశాడు జుబీన్ గార్గ్. జానపదం నుంచి మొదలై సినీ రంగంలో పాడేంత దాకా తన ప్రస్థానం సాగింది. గౌహతిలో అత్యంత ప్రియమైన గాయకుడికి వేలాది మంది వీడ్కోలు పలికారు .వీధులన్నీ క్రిక్కిరిసి పోయాయి. తన ప్రాంతాన్ని, తన మట్టిని, తన జీవితాన్ని అస్సాం ప్రజలతో పెనవేసుకునేలా తనను తాను మల్చుకున్నాడు జుబీన్ గార్గ్. సింగపూర్ నుంచి మృత దేహం గౌహతికి చేరుకోగానే అభిమానులు, అస్సామీలు బోరున విలపించారు.
గార్గ్ అమర్ రహే అంటూ నినదించారు. గాయకుడా నీకు మరణం లేదు. ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు మాతోనే ఉంటావు. మా జ్ఞాపకాలలో, మా అడుగులలో , మా కలల్లో ఎల్లప్పటికీ ఉంటావు జుబీన్ నువ్వు సజీవం. నీ పాట అజరామరంగా కొనసాగుతూనే ఉంటుంది. పాట అనే ఆయుధంతో మమ్మల్ని సాయుధం చేసిన నీకు కన్నీళ్లను తప్ప ఏమిచ్చుకోగలం అంటూ వాపోయారు అశేష జనం.దివికి ఏగిన ఈ గాయకుడి శరీరం కందిపోకుండా ఉండేందుకు పూలను పరిచారు. 25 కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగింది జుబీన్ గార్గ్. దారి పొడవునా అభిమానులు తమకు ఇష్టమైన, ప్రాణప్రదమైన పాటలను ఆలాపించారు. ఆయనకు నివాళులు అర్పించారు. ఎందుకు ఇంత త్వరగా మమ్మల్ని వీడి వెళ్లావంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రజల కోసం , తన మట్టి కోసం చివరి శ్వాస వరకు ప్రాణం కంటే మిన్నగా అభిమానించిన ఈ గాయకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
జుబీన్ దా గాయకుడు మాత్రమే కాదు గుండె నిండా ప్రేమతనం కలబోసుకున్న అరుదైన మానవుడు. తను లేక పోవడాన్ని అస్సామీ వాసులే కాదు సంగీత ప్రేమికులు తట్టుకోలేక పోతున్నారు. సరిహద్దులను చెరిపేసి కోట్లాది ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ఆ పాట అర్ధాంతరంగా రాలి పోవడం, బాధాకరం, పూడ్చలేని అగాధం. నువ్వు లేవు, నీ పాట మిగిలే ఉంది. కానీ మరిచి పోలేని, చెరపలేని గాయాన్ని చేసింది. పాటగాడా నీకు అల్విదా..!