టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
అమరావతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్రవారం రోజున ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలందరూ సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్లా మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో హెలిప్యాడ్ నుంచి విడిది కేంద్రం వరకు సైకిల్ ప్రయాణం చేస్తారని తెలిపారు. టీడీపీ పార్టీ నాయకులతో పాటు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. పర్యావరణం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ ఆలోచనతోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు పల్లా శ్రీనివాస రావు. సైకిల్ వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఇంధన వినియోగం తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ప్రకృతికి మేలు జరుగుతుంది. చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ రోజువారీ కార్యక్రమాలకు సైకిళ్లను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటాలని అన్నారు.





