ఇంగ్లండ్ : ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకే కుప్ప కూలడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ T20 మ్యాచ్‌లో భారత్ ప్రదర్శించిన అత్యంత పేలవమైన ఆటతీరును విమర్శించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో అవమానకరమైన ఓటమిని చవిచూసింది, దీనితో టోర్నమెంట్ టైటిల్ గెలిచే అవకాశాలు దాదాపుగా అడుగంటాయి. హర్ష తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో “అంగీకరించలేనిది” (Unacceptable) అని ఒక్క మాటలో స్పందించారు. అంతకు ముందు భారత ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు వరుసగా వికెట్లు పడిపోతున్న దృశ్యాన్ని, ముంబైలో భారీ నష్టాన్ని కలిగిస్తున్న బలమైన గాలులతో హర్ష భోగ్లే పోల్చారు.
ముంబైలో బలమైన గాలులు… నాటింగ్‌హామ్‌లో వికెట్లు గాలికి కొట్టుకు పోయాయి అని ఆయన వ్యాఖ్యానించారు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండవ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మూడవ మ్యాచ్‌లో ఓటమితో, భారత్ పుంజుకుని మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తే తప్ప ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ మిగిలిన మ్యాచ్‌లు గెలిచినా, సిరీస్ గెలవడానికి , అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి అది సరిపోక పోవచ్చు. గ్రేట్ బ్రిటన్‌లో భారత్ పర్యటన మర్చిపోలేని చేదు అనుభవంగా మిగిలి పోయింది.







