
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల కొండ భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ప్రతి రోజూ 75,000 మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈసారి భారీ ఎత్తున లక్షలాదిగా భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి రానున్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది రాకుండా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఆలయ ముఖ్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం ఏర్పాట్లలో మునిగి పోయారు.
ఈ సందర్బంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు. సెప్టెంబర్ 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని, టీటీడీ సీవీ, ఎస్వో మురళీకృష్ణ ఆధ్వర్యంలో అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరవుతారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ శ్రీవారికి వాహన సేవలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన రోజుల్లో పెద్దశేష వాహన సేవ, గరుడ వాహన సేవ, రథోత్సవం, చక్రస్నానం వంటి రోజుల్లో భధ్రతను కట్టుదిట్టం చేస్తారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, మానిటరింగ్ సిస్టమ్‌లను వినియోగిస్తామన్నారు. ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు, గ్యాలరీలు, ట్రాఫిక్ ,నిర్వహణ , ప్రత్యేక పార్కింగ్ జోన్‌లు అన్ని సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించనున్నట్లు తెలిపారు చైర్మన్, ఈవోలు.