ఉత్కంఠ భ‌రితం స్పీక‌ర్ కిం క‌ర్త‌వ్యం..!

తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌త్యేకించి గ‌త కొంత కాలంగా సాగదీస్తూ వచ్చారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాలె యాదయ్య‌, సంజ‌య్ కుమార్, కృష్ణ మోహ‌న్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్ , గాంధీ, దానం నాగేంద‌ర్ , క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్ రావు ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మార‌డం లేదా ఫిరాయించ‌డం అనేది చ‌ట్ట రీత్యా నేరం. కానీ ఇప్పుడు వాటిని ఎవ‌రూ ప‌ట్టించు కోవ‌డం లేదు. దీనినే ఆస‌రాగా చేసుకుని ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైన వారంతా అడ్డ‌గోలుగా ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ఇంకా అలాగే ప్ర‌వ‌ర్తిస్తూ వ‌స్తున్నారు. ఈ స‌మ‌యంలో త‌మ‌కు వెసులుబాటు క‌లుగుతుంద‌ని, స్పీక‌ర్ పై నిర్ణ‌యం తీసుకునే లేదా ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండ‌ద‌ని భావించారు స‌ద‌రు ఎమ్మెల్యేలు. ఎన్నికైన నాటి నుంచి నేటి దాకా కండువాలు క‌ప్పుకోవ‌డం, మార్చు కోవ‌డం అన్న‌ది చేస్తూ వ‌చ్చిన వీరికి బిగ్ షాక్ ఇచ్చింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.

ఈ సంద‌ర్బంగా పార్టీ ఫిరాయింపున‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. వీట‌న్నింటిని క‌లిపి సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ కు, ముఖ్యంగా అడ్డ‌దిడ్డంగా మాట్లాడుతూ పాల‌న‌ను గాలికి వ‌దిలేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఛెంప ఛెల్లుమ‌నిపించేలా తీర్పు చెప్పింది. మూడు నెల‌లు స‌మ‌యం ఇస్తున్నామ‌ని, అంత వ‌ర‌కు కూడా వేచి ఉండ కూడ‌ద‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని వ్యాఖ్యానించింది. పార్టీలు ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు నోటీసులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించింది. స్పీక‌ర్ ను నేరుగా ఆదేశించే అధికారం లేక పోయిన‌ప్ప‌టికీ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డిన స‌మ‌యంలో ఎవ‌రినైనా ప్ర‌శ్నించే, సూచించే ప‌వ‌ర్ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు మూడు నెల‌ల పాటు గ‌డువు కేటాయించింది.

విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు గీత దాటినా వేటు వేయాలంటే కేవ‌లం స్పీక‌ర్ కు మాత్ర‌మే అధికారం ఉంటుంది. దీంతో స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కూడా సూచించ‌గ‌ల‌దే త‌ప్పా ఆదేశించ లేదు. 1985లో వచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ప్ర‌కారం ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీలో చేరినా, పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా, స్వతంత్ర అభ్యర్థి గెలిచాక పార్టీలో చేరినా, అలాంటి సందర్భాల్లో ఆ సభ్యుని అసెంబ్లీ లేదా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. డిఫెక్షన్ కేసుల్లో తుది తీర్పు ఇచ్చే అధికారం స్పీకర్ దగ్గరే ఉంటుంది. అయితే
స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని తర్వాత కోర్టులో సవాలు చేసే వీలు క‌ల్పించంది రాజ్యాంగం. గ‌తంలో క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌ల్లో చాలా సార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ తీర్పులు ఇచ్చారు. స‌భ్యుడు ఫిరాయింపున‌క‌కు గుర‌య్యాడా లేదా అనే నిర్ణ‌యం స్పీక‌ర్ కు మాత్ర‌మే ఉంటుంది. ఒక‌వేళ స‌భ్య‌త్వం ర‌ద్ద‌యితే ప‌ద‌విని కోల్పోతాడు. తిరిగి ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది.

2014లో తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్, టీడీపీ, బీఎస్‌పీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. 2014–2018 కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలో 11 మంది గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఇక్క‌డ స్పీక‌ర్ తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీని వదిలి మరో పార్టీలో కలిశారు కాబట్టి ఇది ఫిరాయింపు చ‌ట్టం వ‌ర్తించ‌దంటూ పేర్కొన్నారు. తెలంగాణలో ఫిరాయింపు కేసులు చాలా వరకు విలీనం నిబంధ‌న ఆధారంగా న్యాయ‌బ‌ద్దం చేయ‌బ‌డ్డాయి. దీని వ‌ల్ల చాలా మంది ఎమ్మెల్యేలు స్పీక‌ర్ అనుమ‌తితో ప‌ద‌వి పోకుండా మ‌రో పార్టీలో కొన‌సాగారు. తొలి పాల‌నా కాలంలో 23 మంది బీఆర్ఎస్ లో చేరారు. మ‌రోసారి ఎన్నిక కాగా కాంగ్రెస్ కు 19 సీట్ల వ‌స్తే 12 మంది ఒకేసారి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. కొంత మంది స్వ‌తంత్రులు కూడా చేరారు. వీరి సంఖ్య 15కి చేరింది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపున‌కు పాల్ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై అనర్హ‌త పిటిష‌న్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , స్పీక‌ర్ జాప్యాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా అంత‌కు మ‌ముందు అనర్హత పిటిషన్లను నాలుగు వారాల్లోగా విచారించడానికి షెడ్యూల్‌ను నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ స్పీకర్‌ను ఆదేశించింది. డివిజన్ బెంచ్ తరువాత ఆ ఉత్తర్వును పక్కన పెట్టి, స్పీకర్ సహేతుకమైన సమయం తీసుకోవచ్చని పేర్కొంది . ఆ తర్వాత పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఇది ఇప్పుడు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను పక్కనపెట్టి, సింగిల్ బెంచ్ ఆదేశాలను పునరుద్ధరించింది, దీనితో గడువు మరింత కఠినతరం అయింది. ఎమ్మెల్యేలు విచారణను మరింత ఆలస్యం చేయడానికి ప్రయత్నించకుండా కోర్టు నిషేధించింది . ఒక‌వేళ‌ వారు అలా చేయడానికి ప్రయత్నిస్తే ప్రతికూల నిర్ధారణ తీసుకోవచ్చని పేర్కొంది. రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి అనర్హత నిర్ణయాలను స్పీకర్‌కు అప్పగించడం కొనసాగుతుందా లేదా అని పార్లమెంటు సమీక్షించాలని కోర్టు కోరింది. ప్రజాస్వామ్య పునాదిని కాపాడుకోవాలంటే ఈ యంత్రాంగాన్ని తిరిగి పరిశీలించాలని నొక్కి చెప్పింది. చివ‌ర‌గా స్పీకర్ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా లేక తాత్సారం చేస్తారా అన్న‌ది వేచి చూడాలి.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *