
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్దన్న అమెరికా ఇప్పుడు ఆయుధాలనే కాదు వరల్డ్ మార్కెట్ ను శాసిస్తున్న క్రికెట్ పై కూడా ఫోకస్ పెట్టింది. తనకు ఆదాయం కలిగించే ఏ దానిని యుఎస్ ఊరికే వదిలి పెట్టదు. ఎందుకంటే డాలర్లు, ట్రిలియన్లు, బిలియనీర్ల పదాలు ఎక్కువగా వినిపించేది ఆ దేశంలోనే కాబట్టి. క్రికెట్ అనేది ఒకప్పుడు డబ్బున్నోళ్లు ఆడే ఆట. దానికి ఇంకో పేరు కూడా ఉంది జెంటిల్మెన్ గేమ్ అని. కానీ ఇప్పుడు సీన్ మారింది. యావత్ క్రీడా లోకంలో బేస్ బాల్ , టెన్నిస్ , ఫుట్ బాల్ , గోల్ఫ్, చెస్ తో పాటు క్రికెట్ ఇప్పుడు అత్యంత జనాదరణ పొందిన ఆటగా మారి పోయింది. క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయితే. ఇప్పుడు మెట్టినిల్లుగా , కేరాఫ్ గా మారి పోయింది భారత దేశం.
ఈ దేశంలో క్రికెట్ అన్నది ఆట కాదు అది ఓ మతం. దాని చుట్టూ లక్షల కోట్ల మార్కెట్ కొనసాగుతోంది. టెన్నిస్ , ఫుట్ బాల్ కు యుఎస్ తో పాటు యూరప్ కంట్రీస్ ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవి. కానీ రాను రాను టెక్నాలజీలో మార్పులు రావడం, 5జీ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాక సిట్యూయేషన్ పూర్తిగా ఆటలపై ఫోకస్ పెట్టేలా చేశాయి. కులం, మతం, ప్రాంతాలను దాటుకుని క్రికెట్ విస్తరించింది. చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేసింది. అరబ్ ఇలాఖాలో ఈ ఆట ఓ జూదంగా మారింది. తనను తాను క్రీడారంగంలో రారాజుగా మారేందుకు అడుగులు వేస్తోంది క్రికెట్. ఒకనాడు తిరస్కరించిన పెద్దన్న అమెరికా ఇప్పుడు క్రికెట్ పై ఓ కన్నేసి ఉంచింది. కారణం ప్రపంచ మీడియా రంగాన్ని శాసిస్తూ వస్తున్న స్టార్ గ్రూప్ , రిలయన్స్, తదితర బడా కంపనీలకు భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది క్రికెట్ నుంచి. మిగతా ఆటలు కేవలం కొంత కాలానికే పరిమితమయ్యాయి. కానీ క్రికెట్ అన్నది ఏడాది పొడవునా కొనసాగుతూ వస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పుడు క్రికెట్ జపం చేస్తున్నాయి. క్రికెట్ ను ప్రాక్టీస్ చేసే పనిలో ఉన్నాయి.
క్రికెట్ వల్ల విలువైన సమయం పాడవుతుందని పదే పదే దెప్పి పొడిచిన అమెరికా ఉన్నట్టుండి మనసు మార్చుకుంది. ఇంకేం ఆయుధం కంటే ఈ ఆట బలమైనదని, భారత్ మార్కెట్ ను కొల్లగొట్టాలంటే, ప్రపంచ మార్కెట్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ముమ్మరంగా క్రికెట్ పై ఫోకస్ పెట్టింది అమెరికా. ఇక యుఎస్ లో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు ఏకంగా టెక్ దిగ్గజ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఇందులో గూగుల్ తో పాటు మైక్రో సాఫ్ట్ సైతం క్రికెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. క్రికెట్ ను ఆదరించేందుకు ప్రధాన కారణం ప్రవాస భారతీయులు యుఎస్ లో కనీసం 40 శాతానికి పైగా ఉండడం.వాషింగ్టన్ , న్యూయార్క్ , న్యూ జెర్సీ, సిలికాన్ వ్యాలీ, టెక్సాస్ , డల్లాస్ , తదితర నగరాలలో అత్యధికంగా ఎన్నారైలు ఉన్నారు.
మొత్తంగా సాకర్ తర్వాత వరల్డ్ లో అత్యంత జనాదరణ కలిగిన ఆటగా క్రికెట్ చేరింది. అమెరికాలో 300 కంటే ఎక్కువగా లీగ్ లు కొనసాగుతుండడం క్రికెట్ పట్ల ఆసక్తి ఏ మేరకు ఉందో తెలియ చేస్తుంది. రాబోయే రోజుల్లో క్రికెట్ టోర్నీలు కూడా నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావిస్తోంది. ఇప్పటికే ఐసీసీ కీలక బృందం అమెరికాను సందర్శించింది. భారీ ఎత్తున ఖర్చు చేసి స్టేడియంలు నిర్మిస్తున్నారు. ఇక్కడే మరికొన్ని డాలర్లను కొల్ల గొట్టాలని చూస్తోంది బీసీసీఐ. దీని వార్షిక ఆదాయం రూ. 10 వేల కోట్ల పైమాటే. భారీ మొత్తంలో ఆదాయం సమకూరడం వెనుక కార్పొరేట్ , బడా కంపెనీలు, వ్యాపారవేత్తలు శాసిస్తుండడమే. మొత్తంగా క్రికెట్ పై ఆమెరికా ఆసక్తి కలిగి ఉండడడం ఒకింత ఆసక్తిని రేపుతోంది. ఎంతైనా క్రికెట్ అన్నది జెంటిల్మెన్ గేమ్ కాదు అది డాలర్ల పంట పండించే అక్షయపాత్ర అని చెప్పక తప్పదు.