
సమున్నత భారత దేశం సిగ్గు పడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పట్ల. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 79 ఏళ్లవుతోంది. ఈ వేళ కూడా మరోసారి తల దించుకునేలా ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిస్సిగ్గుగా , జాతికి తలవంపులు తెచ్చేలా మాట్లాడటం దారుణం. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. తన జీవిత కాలంలో ఇలాంటి చెత్త ఈసీని తాను చూడలేదన్నాడు ప్రముఖ సామాజిక వేత్త యోగేంద్ర యాదవ్. ప్రజల తరపున, దేశం తల ఎత్తుకునేలా రిప్రజెంట్ చేయాల్సిన జ్ఞానేష్ కుమార్ అజ్ఞానేష్ కుమార్ గా మాట్లాడటం విస్తు పోయేలా చేసింది. ఈసీగా కాకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. పూర్తిగా కేంద్రంలో కొలువు తీరిన రాచరిక , అరాచక పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలకు జీ హుజూర్ అనేలా, వారిని రక్షించేలా కామెంట్స్ చేయడం క్షమించరాని నేరం కూడా. ఓట్ చోరీ గురించి కామెంట్స్ చేసిన ఎంపీ రాహుల్ గాంధీని అఫిడవిట్ సమర్పించాలని లేక పోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించడం మరింత తన పదవిని దిగజార్చేలా చేసింది.
ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి పోటీ చేసే ముందు, నామినేషన్ వేసేందుకు తప్పనిసరిగా ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తారు. ఆ విషయం తెలుసుకోకుండా మరోసారి అఫిడవిట్ అడగడం తన అజ్ఞానాన్ని తెలియ చేస్తుంది. రాహుల్ తో పాటు ఆర్ఎల్డీ నేత తేజస్వి యాదవ్ లేవదీసిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారనేది ఆలోచించు కోవాలి. ఒక రకంగా ఈసీ గత కొంత కాలంగా కొనసాగుతూ , నిర్వహిస్తూ వస్తున్న విశ్వసనీయతను పోగొట్టుకుంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నికల సంఘాన్ని అనుమానంతో చూస్తున్నారు. దీనిని నిలబెట్టు కోవాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈసీని తొలగించిన 65 లక్షల ఓటర్ల జాబితాను సమర్పించాల్సిందేనని ఆదేశించింది. 22 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటు చోరీపై రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని జ్ఞానేష్ కుమార్ కోరడం తను ఎంతగా దిగజారి పోయాడో, ఎలా బీజేపీని వెనకేసుకు వస్తున్నాడో ఒకసారి తనను తాను పరిశీలించుకుంటే మంచిది. సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వమని కోరితే మహిళలు,యువతులకు సంబంధించి సున్నితమైన అంశమని ఇవ్వడానికి కుదరదంటూ మాట మార్చడం మరింత విమర్శలకు , ట్రోల్స్ కు దారి తీసేలా చేసింది. జ్ఞానేష్ నవ్వుల పాలయ్యడు. తల దించుకునేలా చేశాడు.
ఈ సమయంలో సంచలన ప్రకటన చేశాయి ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు. పార్లమెంట్ లో తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని డిసైడ్ అయ్యాయి. మరోసారి చర్చకు తెర లేపారు జ్ఞానేష్ కుమార్. మరి తనను మోదీ తొలగిస్తారా లేక ఇంపీచ్ మెంట్ వర్కవుట్ అవుతుందా అన్నది పక్కన పెడితే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 కింద రక్షణ కల్పించారు. సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారో అదే తరహాలో తప్పించేందుకు అనుసరిస్తారు. ముందుగా పార్లమెంట్ లో మెజారిటీ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఎన్నికల కమిషనర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టలేదు. గతంలో పని చేసిన టీఎన్ శేషన్, జేమ్స్ లింగ్డో , ఎన్. గోపాల స్వామి, సునీల్ అరోరాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తొలగించాలని కోరినా అవసరమైన సంఖ్యా బలం లేక పోవడంతో మానుకున్నారు. మొత్తంగా జ్ఞానేష్ కుమార్ ను మోదీ సర్కార్ కాపాడుతుందా లేక వెన్ను పోటు పొడుస్తుందా, వేటు వేస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ కీలక సమయంలో సుప్రీంకోర్టు మరోసారి కన్నెర్ర చేస్తే తప్పా న్యాయం జరిగే ఛాన్స్ లేదు. ఇకనైనా ఆలోచించాలి. లేకపోతే ఈసీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది.