
నేరం, రాజకీయం కలగిలిసిన ప్రస్తుత తరుణంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు పాలకులుగా ఉంటారని అనుకోవడం భ్రమే. పొలిటికల్ లీడర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోని రాష్ట్రాలకు సంబంధించి కొలువు తీరిన ముఖ్యమంత్రులలో స్టెత స్కోప్ పెట్టినా క్లీన్ ఇమేజ్ కలిగిన వాళ్లు దొరకక పోవడం దారుణం. దేశ దౌర్భ్యాగ్యం కాక మరేమిటి. పాలనా పరంగా దిశా నిర్దేశం చేయాల్సిన వాళ్లు, నాయకత్వ నైపుణ్యంతో అభివృద్ది దిశగా తీసుకు పోవాల్సిన వాళ్లు క్రిమినల్ కేసులను కలిగి ఉండడం బాధాకరం . తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు) పేర్కొన్న వివరాలను ఏడీఆర్ తీసుకుంది. ఆర్టీఐ కింద సేకరించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా ఏయే ముఖ్యమంత్రులపై ఎన్నెన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయనేది ఆరా తీసింది. దిమ్మ తిరిగేలా పెద్ద ఎత్తున కేసులను కలిగి ఉన్నట్లు తేలిపింది. ఇందులో నరేంద్ర మోదీకి చెందిన భారతీయ జనతా పార్టీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన వారున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కొలువు తీరారు.
రాను రాను ప్రజాస్వామ్యం ముసుగు కప్పుకుని , చట్టాలలో నెలకొన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టసభల్లోకి, పార్లమెంట్ లోకి ప్రవేశిస్తున్నారు. తమ పనులు చక్క బెట్టేందుకు , తమకు అడ్డు రాకుండా ఉండేందుకు, అధికారాన్ని ఎల్లకాలం అనుభించేందుకు, దానిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆస్తులు వెనకేసుకునేందుకు, అడ్డు వచ్చినా లేదా ప్రశ్నించినా వారిని భౌతికంగా లేకుండా చేసేందుకు ఆరి తేరి పోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్ట సభల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు, అంశాలు చర్చకు వచ్చేవి. ఇప్పుడు వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్ కంపెనీలు, మాఫియా టీంల కనుసన్నలలో ప్రజా ప్రతినిధులు నడుచుకుంటున్నారు. వారికి అనుగుణంగా సభల్లో బిల్లులను ప్రవేశ పెట్టడం, అవి చట్టాలుగా తయారు కావడం షరా మామూలై పోయింది. పీవీ నరసింహారావు కాలంలో ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు. ఇలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి.
అంతెందుకు క్రిమినల్ కేసులలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఏకంగా ఓ ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆపై జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం మోదీని ప్రసన్నం చేసుకుంటూ ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లో ఉంటూ , దేశాన్ని మోదీని అడ్డం పెట్టుకుని అప్పనంగా దోచుకుంటున్న గౌతమ్ అదానీకి మేలు చేకూర్చే పనిలో పడ్డాడు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవు. నోరు తెరిస్తే బూతులు, ఆపై అహంకార పూరిత ధోరణితో వ్యవహరించడం షరా మామూలుగా మారింది. కోరి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇప్పుడు పాలనా పరంగా అస్తవ్యస్తంగా మార్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. తాజాగా క్రిమినల్ కేసులు కలిగి ఉన్న ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి టాప్ లో నిలవడం విస్తు పోయేలా చేసింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవం తల దించుకునేలా ఉంది. తలవంచని తత్వం తెలంగాణ ప్రాంతానిది. కానీ ఎప్పుడైతే సీఎంగా కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా తన అస్తిత్వానికి భంగం కలుగుతోంది. ఇది బహిరంగ రహస్యమే.
ఏడీఆర్ బహిరంగ నివేదిక మరిన్ని వాస్తవాలను 143 కోట్ల ప్రజానీకం ముందు పెట్టింది. తల దించుకునేలా చేసింది. ఉన్న ముఖ్యమంత్రులలో 40 శాతం సీఎంలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటుడడం గమనార్హం. అయితే కేంద్రం కీలకమైన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఎవరైనా ప్రజా ప్రతినిధులు లేదా సీఎంలు, మంత్రులు , ఇతర ఉన్నతమైన పదవులను చేపట్టిన వాళ్లకు చెక్ పెట్టనుంది ఈ బిల్లు. 30 రోజుల పాటు అరెస్ట్ చేస్తే, జైలుపాలు చేస్తే తొలగించాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. అంటే దేశంలో బీజేపీ నేతలు తప్పా ఇంకెవరూ ఉండేందుకు వీలు లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, రాజ్ నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. ఇప్పటికే ప్రధాన వ్యవస్థలన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉన్నాయి. జీ హూజూర్ అంటున్నాయి. వెన్నుముక లేకుండా తయారయ్యాయి. చివరకు ఎన్నికల సంఘం కూడా జవసత్వాలు కోల్పోయింది.
ఈ తరుణంలో ప్రస్తుతానికి సీఎంలకు సంబంధించి క్రిమినల్ కేసులకు సంబంధించి డేటా రిలీజ్ కావడం కలకలం రేపింది. ఇండియా కూటమికి చెందిన సీఎం రేవంత్ రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందుకే మనోడు తొలి స్థానంలో నిలిచాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై 47 కేసులు నమోదు గాగా అతి తక్కువగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ పై 5 కేసులు నమోదయ్యాయి. దేశంలోని 30 మంది సీఎంలలో 12 మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లలో ప్రకటించారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై 19 కేసులు ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై 13 కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, సుఖ్వీందర్ సింగ్ లపై నాలుగు కేసులు, కేరళ సీఎం పినరయి విజయన్ పై 2 కేసులు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై కేవలం ఒకే ఒక్క కేసు నమోదైంది. 10 లేదా 33 శాతం మంది ముఖ్యమంత్రులపై హత్యా యత్నం, లంచం, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు కేసులు నమోదు అయ్యాయి.
వీరిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ నేరారోపణలు ఎన్నికల్లో పోటీ చేసే కంటే ముందు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్నవే. రాజకీయాలలో నేరస్థుల ఎంట్రీ ఇవ్వకుండా చేసేందుకు బిల్లును తీసుకు వచ్చామని మోదీ , అమిత్ షా చెబుతుండగా కేవలం విపక్షాలను లక్ష్యంగా చేసుకుని, వారిని లేకుండా చేసేందుకే దీనిని తీసుకు వచ్చారంటూ మండిపడుతున్నారు నేతలు. ఇదంతా పక్కన పెడితే తమంతకు తాముగా అఫిడవిట్లలో ప్రకటించిన విధంగా క్రిమినల్ కేసులు నమోదైతే ఎందుకు కోర్టులు మౌనంగా ఉంటున్నాయి. ఎందుకు వీరిని ప్రజా ప్రతినిధులుగా కంటిన్యూ చేసేందుకు ఎన్నికల సంఘం ధ్రువపత్రాలను సమర్పించిందో చెప్పాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వీరిపై తుది తీర్పు వచ్చేంత వరకైనా పదవులలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత కోర్టులదే. లేకపోతే పవర్ ను యూజ్ చేసుకుని మరింత రెచ్చి పోయే ప్రమాదం పొంచి ఉంది. దీని వల్ల ప్రజాస్వామ్యం మరింత ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటుంది. తస్మాత్ జాగ్రత్త.