
రాష్ట్ర వ్యాప్తంగా ఆగని ఆందోళనలు
హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందవంటూ ఆందోళన బాట పట్టారు. తీవ్ర కొరత ఉందని, సకాలంలో అందక పోవడంతో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అంతటా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాలు, ఎరువుల దుకాణాల వద్ద ధర్నాలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది మంది రైతులు తమ పంటలను కాపాడు కోవడానికి కనీసం ఒక బ్యాగ్ యూరియాను పొందాలని PACS కేంద్రాల వద్ద క్యూలో నిలబడ్డారు.సరఫరా లేకపోవడంతో మండిపడుతున్నారు. మండే వేడిలో వేచి ఉన్నారు. మరికొందరు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. జనసమూహాల మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. చాలా చోట్ల, కోపంతో ఉన్న రైతులు నిరసనలు చేపట్టారు, ఎరువుల దుకాణాలపై రాళ్ళు రువ్వారు. పంపిణీని నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఎరువులు లేక పోవడం వల్ల తమ పంటలు ఎండి పోతున్నాయని రైతులు విచారం వ్యక్తం చేశారు.
సకాలంలో సరఫరాను నిర్ధారించడంలో విఫలమైనందుకు నిరసన తెలిపిన రైతులు ప్రభుత్వాన్ని నిందించారు.యూరియా ఎప్పుడు డెలివరీ అవుతుందో అధికారులు స్పష్టం చేయకుండా కేవలం టోకెన్లు జారీ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు . అందుబాటులో ఉన్న పరిమిత నిల్వను రాత్రికి రాత్రే బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తున్నారని మండిపడ్డారు.