
స్పష్టం చేసిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒకే ఒక్కడు దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు ముఖ్యమంత్రి.
ఇందులో భాగంగా తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మ విశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై ప్రధానంగా సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచి పోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియ చెప్పేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.