
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కామెంట్
తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ పొందిన హాస్య బ్రహ్మ , నటుడు కన్నెగంటి బ్రహ్మానంద ఆచారి అలియాస్ బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలోనే పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, అబద్దమని కొట్టి పారేశారు. తన జీవితకథను ఆధారంగా చేసుకుని రాసిన బ్రహ్మానందం ఆత్మకథను ఆవిష్కరించారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో తనను మీడియా ప్రశ్నించింది. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందా అని. దీనికి ఠకీమని సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు బ్రహ్మానందం.అత్యంత పేద కుటుంబం మాది. ఆనాడు చదువుకునే స్థోమత లేదు.
తినేందుకు ఇబ్బంది పడ్డ క్షణం. వాటిని తలుచుకున్నప్పుడల్లా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
ఆనాడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. సమాజం మారింది. కాలం కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ అనుకోకుండా చాలా కష్టాలు అనుభవించాను. అన్నింటిని భరించి అధ్యాపకుడిగా పని చేశాను. ఆ దేవ దేవుడు, కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్యం కారణంగా నాకు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. ఇదంతా ఆ శ్రీవారి వల్లనేనని అనుకుంటానని చెప్పారు. ఈ సమయంలో తాను సినిమాలలో నటించేందుకు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నానని పేర్కొన్నారు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నా శ్వాస , నా ధ్యాస, నా ప్రయాణం అంతా సినిమాలతోనేనని స్పష్టం చేశారు బ్రహ్మానందం. పాలిటిక్స్ కు వచ్చే ఆలోచన లేదన్నారు.