
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్
ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ సంస్కృతి అత్యంత బలమైనదని, అందుకే ఇక్కడ ఎలాంటి విభేదాలు, సంఘర్షణలు చోటు చేసుకోవడం లేదన్నారు. మన దేశం కావాలని ఏనాడూ ఇతర దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం లేదన్నారు. ఇది మనకు ఉన్న గొప్ప లక్షణమని పేర్కొన్నారు. గత్యంతరం లేకనే భారత్ దాయాది పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పారు మోహన్ భగవత్.
వ్యక్తిగత ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే సమస్యలకు కారణం అవుతున్నాయని , సాధ్యమైనంత మేరకు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. భారతీయ ప్రజల పూర్వీకులు వివిధ వర్గాలు, సంప్రదాయాల ద్వారా అనేక మార్గాలను చూపించారని, జీవితంలో జ్ఞానం, క్రియ, భక్తికి సంబంధించిన సమతుల్య ప్రవాహాన్ని ఎలా కొనసాగించాలో నేర్పించారని చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్.
భారతదేశం ప్రతి ఒక్కరి అంచనాలను తప్పుగా నిరూపించడం ద్వారా అభివృద్ధి మార్గంలో నిరంతరం ముందుకు సాగుతోందని అన్నారు.
బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్‌ను ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం ఐక్యంగా ఉండటం ద్వారా తనను తప్పు అని నిరూపించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ విభజన దశకు వస్తోందన్నారు. కానీ ఏ దేశం మనల్ని విడదీయ లేదన్నారు భగవత్.