
హైడ్రా ప్రజావాణికి 26 ఫిర్యాదులు
హైదరాబాద్ : వర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రాకు బాధితుల నుంచి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు ఉన్న నాలాలు కబ్జాకు గురి అవ్వడంతో పాటు వరద కాలువలన్నీ ఎక్కడో ఒక దగ్గర ఆక్రమణలకు గురై వరద నీరు తమ నివాసాలను ముంచెత్తుతోందని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్యాచ్‌మెంట్ ఏరియా ఎంత ఉంది.. నాలా ఎంత వెడల్పులో ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు.. సర్వే నంబరు ఒకటి చూపించి మరో చోట ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. పార్కులు, ప్రజావసరాలకు ఆద్దేశించిన స్థలాలు కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన చెందారు.
ఈ మేరకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి 26 ఫిర్యాదులు అందాయని హైడ్రా ఇంఛార్జ్ వెల్లడించారు. ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించి సబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించారు. కూకట్‌పల్లి మున్సిపాలిటీ, హైదర్‌నగర్ డివిజన్ రామ్‌నరేష్ నగర్‌కాలనీ వరద నీటి కాలువ ద్వారా వర్షపు నీరు సాఫీగా అలీతలాబ్ చెరువులోకి చేరుతుండేది. కాని ఈ నాలా ఎక్కడికక్కడ కబ్జాకు గురి అవ్వడంతో చుట్టుపక్కల ఉన్న నివాసాలను ముంచెత్తుతోందని రామ్‌నరేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ ఆసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కుండపోత వర్షాల వేళ ఉన్న నాలాలు సరిపోని పరిస్థితి ఉంటే.. అవి కూడా కబ్జా అవ్వడం బాధాకరమని.. ప్రభుత్వం సరైన విధానంతో ఆక్రమణలను తొలగించాలని అసోషియేషన్ ప్రతినిధులు కోరారు.