
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
విజయవాడ : దసరా ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ. దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశామన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మ వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. మొత్తం ప్రాంతాన్ని 35 సెక్టార్లుగా విభజించి.. ఒక్కో సెక్టారుకు రెవెన్యూ, వీఎంసీ, పోలీస్ ఇలా వివిధ శాఖల అధికారుల బృందాలను నియమించామని వివరించారు.
100 మీ. – 500 మీ. పరిధిలోని సెక్టార్‌లో ఏ సమస్య ఎదురైనా ఈ బృందాలు తక్షణం స్పందించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాయని.. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందిస్తాయని వివరించారు. అందరం సమష్టిగా పనిచేసి దసరా మహోత్సవాలను విజయవంతం చేద్దామని కోరారు. ఈ ప్రక్రియలో మీడియా భాగస్వామ్యం చాలా కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సూచనలను పరగణనలోకి తీసుకొని ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. దసరా మహోత్సవాల మహా యజ్ఙంలో భాగమవుతున్న ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు.
గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, రవాణా, శాంతిభద్రతల పరిరక్షణ.. ఇలా ప్రతి అంశంలోనూ కొండపైన, కొండ కింద ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని సీపీ తెలిపారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 40 పాయింట్లలో 25 లక్షల వాటర్ బాటిళ్లను సిద్దంగా ఉంచనున్నట్లు తెలిపారు. మూడు షిఫ్టుల్లో 1,600 మంది సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. 405 మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేసినట్లు ధ్యానచంద్ర వెల్లడించారు.