
ఆనందంగా ఉందన్న తన్నీరు హరీశ్ రావు
సంగారెడ్డి జిల్లా : సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భావోద్వేగంతో కూడుకుని ఉన్నదని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దీని వల్ల రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. ఈ ఫ్యాక్టరీ రావడానికి కష్టపడింది, చెమట చిందించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. విత్తనం నాటింది బిఆర్ఎస్ కానీ ఆ పండ్లను తినడానికి కాంగ్రెస్ బయలు దేరిందని అన్నారు. రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించడానికి కత్తెర జేబులో పెట్టుకొని బయలు దేరాడంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. గాలిలో తేమ శాతం లేదని 2018లో పామాయిల్ సాగు జరగదని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. కానీ 2021లో ఇదే ప్రాంతం గాలిలో తేమ శాతం పెరిగి పామాయిల్ సాగుకు అనువైన ప్రాంతంగా మారిందన్నారు.
ఒకనాడు కరువు ప్రాంతం నేడు పామాయిల్ సాగుబడికి అనుకూలంగా మారడం సంతోషం కలిగించిందని చెప్పారు హరీశ్ రావు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని జోష్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తన వరకు చాలా ఆనందంగా ఉందని, ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు మాజీ మంత్రి. వేలాది మంది రైతులకు ఇది ఆదెరువు కానుందన్నారు.