
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రాపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇప్పటి వరకు తాను వచ్చాక హైదరాబాద్ లో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 923.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు. దీని విలువ రూ. 50 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా అని పేర్కొన్నారు. గాజుల రామారం, ప్రగతినగర్ మధ్యన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఈ భూమి కబ్జాలకు గురౌతుంటే స్థానికుల ఫిర్యాదుమేరకు విచారణ జరిపి కబ్జాలను తొలగించడం జరిగిందన్నారు. మొత్తంగా 581 ఆక్రమణలను తొలగించామన్నారు. ఇందులో బడాబాబుల కబ్జాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కమిషనర్. గండిపేటలో ప్రముఖ రాజకీయ నాయకుల రిసార్టులు, ప్లే ఏరియాలు తొలగించామని స్పష్టం చేశారు రంగనాథ్.
మూసీ నది ప్రవాహంపై ప్రభావం పడే విధంగా ఉన్న ఆక్రమణలు భారీ మొంత్తంలో తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ భూములు 424 ఎకరాలు కాగా నాలాలు, రహదారులు, పార్కులు, చెరువులు, అనుమతులు లేని నిర్మాణాలు వెలిసిన చోట తొలగించిన ఆక్రమణలు కలిపితే మొత్తం 923.14 ఎకరాల భూమిని కాపాడామని చెప్పారు. హైడ్రా చేసిన పనులు ఇప్పుడు తెలియని కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందన్నారు. నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోందని అన్నారు. వరద కాలువలు 10 మీటర్ల వెడల్పుతో ఉన్నవి కేవలం 1 నుంచి 2 మీటర్లకు పరిమితం అవుతున్నాయని ఆవేదన చెందారు. వీటిని విస్తరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.