
రేపటి నుంచి కొత్త దుకాణాలకు దరఖాస్తులు
హైదరాబాద్ : ఓ వైపు మద్యం ప్రమాదమని, తాగొద్దంటూ తెగ ప్రచారం చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. కానీ మరో వైపు మద్యం అమ్ముకునేందుకు బార్లా తెరిచింది. తాజాగా మద్యం వ్యాపారులకు ఖుష్ కబర్ చెప్పింది. కొత్త మద్యం దుకాణాలు కావాలని అనుకునే వారికి సంతోషం కలిగించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అధికారికంగా విడుదల చేసింది. ఈ విషయాన్ని సదరు ప్రభుత్వమే వెల్లడించడం విశేషం. కొత్తగా మద్యం దుకాణాలు పొందేందుకు గాను ఈనెల 26 నుండి అంటే శుక్రవారం నుండి అక్టోబర్ 18 వరకు ఫారమ్‌లను సమర్పించవచ్చు అని తెలిపింది. సామాజిక వర్గం రిజర్వేషన్లు అమలులో ఉన్న లైసెన్స్‌లు రెండేళ్ల పాటు చెల్లుతాయి. 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
వచ్చిన దరఖాస్తులలోంచి అక్టోబర్ 23న లాటరీ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త లైసెన్స్‌లను జారీ చేస్తుంది. కొత్త దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. ఎక్సైజ్ చట్టం, 1968 కింద దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తులు లేదా ప్రభుత్వానికి బకాయిలు పెండింగ్‌లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా పేర్కొంది. . కేటాయింపులో గౌడ్ కమ్యూనిటీకి 15 శాతం, , షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ కోరుకునే దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలని పేర్కంది.