
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
తిరుమల : ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలన్నది తమ సంకల్పమని, ఇందుకు అనుగుణంగా భక్తులు, దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి దాతలు విస్తృతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్వి ప్రాణదాన ట్రస్టును టిటిడిలో ప్రారంభించామని గుర్తుచేశారు. ఇప్పటివరకు రూ.709 కోట్లు ఈ ట్రస్టుకు విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు, అవసరమైన రోగులకు వైద్య సహాయంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయాలని టిటిడిని కోరారు. స్వామివారి సేవకులు స్వామివారి నిజమైన సంపద అని, తిరుమల పవిత్రతను కాపాడే ఆవశ్యకతను ప్రజల్లో విస్తరించాల్సిన బాధ్యత వారిదేనన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవలో ఇప్పటివరకు 17 లక్షల సేవకులు, 12 లక్షల మహిళలు, 5 లక్షల పురుషులు తిరుమల చేరే భక్తులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ప్రజలు ఆరోగ్యవంతంగా, సంతోషంగా, సంతృప్తిగా జీవించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం టిటిడి అన్నప్రసాదం, ఆలయ నిర్మాణం, ప్రాణదానం, స్వామివారి సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర హెచ్ ఆర్ డి , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పలువురు ఎమ్మెల్యేలు, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.