
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థలకు భవనాలు లేవన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు .ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు మంత్రి. త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీల భవనాల నిర్మాణంపై ఫోకస్ పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో 540 మంది కెపాసిటీ ఉండగా 120 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నూరు శాతం టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలిపారు. ఇక్కడ సొంత భవనం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా బ్రహ్మంగారి మఠం మండలంలో నవోదయ స్కూలు మంజూరైందని తెలిపారు.
అక్కడ ఖాళీగా ఉన్న భవనంలో ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులు చదువు కోవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలు కోనసీమ దీవిలో ఉన్నాయని తెలిపారు. ఇందులో 3 అసెంబ్లీలు పక్క పక్కనే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ లేక పోవడం వల్ల విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువు కోలేక పోతున్నారని వాపోయారు. ఓఎన్ జిసి, గెయిల్, రిలయన్స్ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విద్యా పరంగా మాది వెనుకబడిన జిల్లా అని, మొన్ననే డిగ్రీ కళాశాల ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తే యువతకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ 2024-25లో పాలిటెక్నిక్ కళాశాలల్లో 94 శాతం సక్సెస్ రేటు ఉందన్నారు.