
అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్ : కబ్జా కోరల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆనవాళ్లు లేకుండా తయారైన బతుకమ్మ కుంట చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేశారు. ఆపై కనిపించకుండా చేశారు. ఆ భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో యెడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మకుంటను హైడ్రా చేపట్టింది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో కలిసి చెరువు చరిత్రను తవ్వి తీసింది. అన్ని విభాగాలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి బతుకమ్మ కుంట చెరువే అని నిర్ధారించుకుంది. అనంతరం రంగంలోకి దిగింది. బతుకమ్మ కుంట పునరుద్ధరణ ప్రక్రియలో హైడ్రా అనేక న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా భూ కబ్జాదారులైన సయ్యద్ ఆజం, సయ్యద్ జహాంగీర్ , ఏ. సుధాకర్ రెడ్డి లాంటి వారు వేసిన పిటిషన్లపై కోర్టులు పదేపదే ఇది చెరువు భూమియేనని స్పష్టం చేశాయి.
మండు వేసవిలో దాదాపు రూ. 7.15 కోట్లతో బతుకమ్మ కుంట పనులను హైడ్రా చేపట్టింది. జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని రుజువు చేసింది. అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. బతుకమ్మ కుంట కాదు ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారిని ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి ముళ్ల పొదలను తొలగించి తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చారు సర్వే అధికారులు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది.