
ఫైనల్ పోరులో సత్తా చాటిన తెలుగు కుర్రాడు
దుబాయ్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ కీలక పోరులో చివరకు విజేతగా నిలిచింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు . ఎన్నో వివాదాలు, మరెన్నో విమర్శలు, ఛీత్కారాలు, ద్వేషాల మధ్య ఈ టోర్నీ కొనసాగింది. పాకిస్తాన్ పడుతూ లేస్తూ ఫైనల్ కు చేరుకుంది. కానీ టీమిండియా మాత్రం ఎక్కడా తొణక లేదు. బెణకలేదు. సరికదా తనకు ఎదురే లేదని సత్తా చాటింది. యావత్ 143 కోట్ల మంది భారతీయుల ఆశలను వమ్మ చేయకుండా సగర్వంగా నిలిచేలా చేసింది. ఒకానొక దశలో ఇండియా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. ఉన్నట్టుండి ప్రధాన వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.
మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయం సరైనదేనని నిరూపించారు భారత ఆటగాళ్లు. బౌలర్లు సత్తా చాటారు. ప్రత్యేకించి మరోసారి సత్తా చాటాడు కుల్దీప్ యాదవ్. పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. ఆసియా కప్ టోర్నీలో తను 17 వికెట్లు తీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే పాకిస్తాన్ 146 రన్స్ కే పరిమితమైంది. ఈ తరుణంలో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది 21 పరుగులకే. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సత్తా చాటాడు. చివరి వరకు ఉండి 69 రన్స్ చేశాడు. సంజూ శాంసన్ తో కలిసి 54 రన్స్ , శివమ్ దూబేతో కలిసి 64 పరుగులు జోడించాడు. మొత్తంగా మరోసారి తను కీ రోల్ పోషించాడు ఇండియా కప్ గెలవడంలో.