
జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి షాకింగ్ కామెంట్
మంగళగిరి : మాజీ సీఎం జగన్ రెడ్డి బహుజనుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారిథి. టీడీపీ కేంద్ర కార్యాలయంంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన హయాంలో అన్ని చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిని అగ్రవర్ణాలు, తన సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. పేదలు, బహుజనుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు పార్థసారథి. కానీ కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువు తీరాక సీన్ మారిందన్నారు. అన్ని వర్గాల వారికి సమ న్యాయం అందించామన్నారు. కానీ జగన్ రెడ్డి, ఆయన పరివారం ఓర్చుకోలేక పోతోందని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సహాయం పెంచడం, గౌరవ వేతనాల్ని పెంచడం, హ్యాండ్లూమ్‌కి విద్యుత్ యూనిట్లు మంజూరు చేయడం, నేతన్నలకు సంవత్సరానికి ఆర్థిక సహాయం వంటి అనేక సంక్షేమ చర్యలు చేపట్టిందని చెప్పారు మంత్రి పార్థసారథి. బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకొచ్చినవేనని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు ఉద్యోగాలపెంపు, డిఎస్సీ మాదిరిగా 16,500 మందిని నియమించడం, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్లలో వేలాది ఉద్యోగాల కల్పన వంటివి చేపట్టామని గుర్తు చేశారు. చంద్రయ్య కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలన్నప్పుడు ఎందుకు ఆపేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వ స్థాయిలో పలుమార్లు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం సమకూర్చిన విషయాలను గుర్తు చేశారు.
అదే తత్వాన్ని ఇక్కడ కూడా పాటించాలన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల వేలాది మంది రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరం అయ్యారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో జరిగిన దాడులు, బలహీన వర్గాలపై అవమానాల సంఘటనలు ప్రజలు చూడలేదా అని ప్రశ్నించారు. అన్నీ గమనించారు కాబట్టే వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రావడం లేదన్నారు.