
68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం
అమరావతి : ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు బార్బాడోస్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం (సీపీసీ), సీపీఏ సర్వ ప్రతినిధి సభకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా స్పందించారు స్పీకర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధిగా హాజరు కాగలగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సీపీఏ వార్షిక సమావేశం, కామన్వెల్త్ పార్లమెంట్ల నుండి వచ్చే సహచరుల నుండి ఆయా ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలుసు కోవడానికి, వారి అనుభవాల నుండి మంచి విషయాలు నేర్చు కోవడానికి సభ్యులందరికీ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి సహాయ పడే విలువైన విషయాలు ఈ సమావేశాల్లో నేర్చుకోగలుగుతామని ఆశిస్తున్నట్లు చెప్పారు.
68వ సీపీసీ ప్రధాన ఇతివృత్తం కామన్వెల్త్ భౌగోళిక భాగస్వామి అని పేర్కొన్నారు. . ఈ సమావేశాల్లో ‘ప్రజాస్వామ్యానికి మద్దతుగా పార్లమెంట్లను బలోపేతం చేయడంపై ఎక్కువగా చర్చ జరుగుతుందన్నారు.
‘ప్రపంచ ఆధునికీకరణకు సాంకేతికత, కృత్రిమ మేధను ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావం, చట్టసభలపై విశ్వాసాన్ని పెంపొందించడం వంటి విస్తృత శ్రేణి అంశాలపై చర్చిస్తామన్నారు స్పీకర్.
ప్రజాస్వామ్యానికి మద్దతుగా మన వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం, పారదర్శకతను పెంపొందించడం, పార్లమెంట్లు, ఎన్నికలలో ఆర్థిక పారదర్శకత, జాతీయ పార్లమెంట్ లు, ప్రాంతీయ, ప్రాదేశిక, వికేంద్రీకృత చట్ట సభలు, అధికారాల విభజన ప్రాముఖ్యత అనే అంశాలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు.