సంచలన ఆరోపణలు చేసిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని పనిగట్టుకుని అవినీతిమయంగా మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరు నూరైనా సరే మన స్థానాన్ని మనం నిలబెట్టు కోవాలని పిలుపునిచ్చారు. బిల్డింగ్ పర్మిషన్‌కు స్క్వేర్ ఫీట్‌కు రూ. 75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమీషన్ ఇవ్వాలంటూ ఫీజులు నిర్ణయించారని మండిపడ్డారు. ఇదేనా మీ ప్రజా పాలన అని ప్రశ్నించారు. ఇళ్లు జాగ, భూముల సమస్యలు పరిష్కారం కావాలంటే 40 శాతం భూములు రాసివ్వాలట, మొత్తం పర్సెంటేజీలు డిసైడ్ చేశాడని సీఎంపై మండిపడ్డారు హరీశ్ రావు.
ఒకప్పడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేదన్నారు. తెలంగాణ ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం ఆ పథకం స్టార్ట్ చేసేదన్నారు. తెలంగాణ అనుసరిస్తే, దేశం ఆచరించేదని చెప్పారు . ఒక రాష్ట్రం ఎట్లా ఉండాలో కేసీఆర్ తయారు చేస్తే, రాష్ట్రం, సీఎం ఎట్లా ఉండగూడదో రేవంతు తయారు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి . ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. గాంధీ టోపీలు పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ఆనాడు కేసీఆర్ 350 బస్తీ దవాఖానలు ప్రారంభించారని, . ఉచితంగా పరీక్షలు చేసే విధంగా డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు.
రేవంత్ ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిందన్నారు. గత ఆరు నెలలుగా బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది జీతాలు చెల్లించడం లేదన్నారు. ఇక మందులు లేక నానా తంటాలు పడుతున్నారని వాపోయారు హరీశ్ రావు.






