స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఇవాళ వ్యవసాయ రంగానికి ఏ రాష్ట్రంలో లేనంతగా తాము మద్దతు ఇస్తూ వచ్చామన్నారు. గత జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కావాలని రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన చెందారు. కానీ తమ కూటమి సర్కార్ కొలువు తీరాక వీటికి పుల్ స్టాప్ పెట్టామన్నారు. పూర్తి పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
సీఆర్డీఏ ఆధ్వర్యంలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం పూర్తిగా అందజేస్తామని ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు ముఖ్యమంత్రి. రైతులకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మీ సమస్యలు ఏవైనా ఉంటే కమిటీకి తెలియ చేయాలని, వారు పరిష్కరిస్తారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌లతో కూటమిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే రాజధాని రైతులు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురు నేతలను కలవాలని సూచించారు. ఇదిలా ఉండగా నేతలు, ప్రజా ప్రతినిధులు తరచూ రైతులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.






