కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ : గ్రూప్ -1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం హైదరాబాద్ లోని నాంపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ -1 పరీక్ష బాధితులను కలిసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్బంగా కవిత మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని ఆరోపించారు. ఎందుకు విచారణ చేపట్టేందుకు ముందుకు రావడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్ ను.
ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడని, ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతోందని నిలదీశారు కవిత. అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే తాము కోరుతున్నామని అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించు కోవటం లేదన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలని, లేదంటే తాము బీహార్ కు వెళతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






