అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి జయంతి
హైదరాబాద్ : భారత దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అక్టోబర్ 15న ఆయన జయంతి. ఇదే రోజు 1931లో పుట్టారు. జూలై 27, 2015లో కాలం చేశారు. ఆయన ఈ లోకాన్ని వీడి 10 ఏళ్లవుతోంది. అయినా కలాం జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అత్యంత నిరుపేదమైన కుటుంబంలో పుట్టిన తను ఇంటింటికీ తిరుగుతూ దినపత్రికలు అమ్మాడు. కష్టపడి చదువుకున్నాడు. దేశం గర్వించేలా శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఆయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు.
భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పని చేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరు పొందాడు. కలాం బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.






