విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న నకిలీ ఓట్ల వ్యవహారంపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పంచారని ఆరోపించారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. వారి ఫోటోలు పెట్టుకుని మరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా నకిలీ ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేసు నమోదు చేసిందని చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాతనే పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారని వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారని అన్నారు కేటీఆర్.
43 ఓట్లు ఉన్న సంస్కృతి అపార్ట్మెంట్ కు వెళ్లి చూడడం జరిగిందన్నారు. అక్కడ ఉన్న ఇంటి ఓనర్ ఈ ఓట్లతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారని చెప్పారు. ఇక బూత్ నంబర్ 125 లో ఒక ఇంట్లో 23 ఓట్లు ఉన్నాయని, 80 గజాలు మాత్రమే ఉన్న ఇంట్లో ఇంత మంది ఎలా వచ్చారో తెలియదన్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కింది స్థాయి అధికారులను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించు కుంటుంది అన్న అనుమానం కలిగిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు సంబంధించిన ఇంట్లో 32 దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు ఉన్నాయన్నారు.






