జూలు విదిల్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రెమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కబ్జా రాయుళ్లు, ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. మరో వైపు తాను చేపడుతున్న హైడ్రా ప్రజా వాణికి బాధితులు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మేరకు కుల్సుంపూరలో రూ. 110 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు అశోక్ సింగ్ అనే రౌడీ షీటర్. ఇందుకు సంబంధించి ప్రజావాణిలో బాధితులు మొర పెట్టుకున్నారు. ఇదే స్థలం ఆక్రమణ గురించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సైతం హైడ్రాకు తెలిపారు.
దీంతో ఫుల్ ఫోకస్ పెట్టారు కమిషనర్ ఏవీ రంగనాథ్ . ఇదిలా ఉండగా దీనిని తన భూమిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు రౌడీ షీటర్ అశోక్ సింగ్. విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇప్పటికే రెండు సార్లు ఆక్రమణలను తొలగించారు రెవెన్యూ అధికారులు . అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా.. అద్దెలు తీసుకుంటున్నాడు అశోక్ సింగ్. ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్‌పై వివిధ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా పేర్కొంటూ పలు కేసులు నమోదయ్యాయి. లంగర్‌హౌస్, మంగళహాట్, శాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో అశోక్ సింగ్‌పై 8కి పైగా కేసులు ఉన్నాయి. శుక్రవారం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా.






