గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి
బెంగళూరు : కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చిందని, అందుకే విశాఖకు గూగుల్ వెళ్లిందన్నారు. ఏకంగా సదరు కంపెనీకి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. స్టేట్ GSTలో 100% రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారని అన్నారు. వాళ్లకు కేటాయించిన భూమి 25% డిస్కౌంట్ కూడా ఇచ్చారని తెలిపారు.నీళ్లపై టారిఫ్‌లో కూడా 25% డిస్కౌంట్ ఇచ్చారు, ట్రాన్స్‌మిషన్ 100% ఉచితంగా కల్పించనున్నారని చెప్పారు ఖర్గే. ఇవన్నీ వాళ్లు చెప్పరని, గూగుల్ వచ్చింది అని మాత్రమే చెబుతారని ఆరోపించారు. ఒకవేళ అన్ని రాయితీలు మేము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని అభాండాలు వేస్తారని , వాటిని భరించలేకనే తాము గూగుల్ తో ఒప్పందం చేసుకోలేదన్నారు.
బెంగళూరులో జనావాసం ఎక్కువ అవుతుందని అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువ అవుతుంది కదా అని సంచలన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఏపీలోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ను నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ డేటా సెంటర్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా చివరికి ఏపీ దాన్ని సొంతం చేసుకోవడంతో రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇలా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు రప్పించినట్లు స్వయంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.






