స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జస్టిస్
హైదరాబాద్ : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అమలు చేయక పోవడం దారుణమన్నారు మాజీ జస్టిస్ , మాజీ దేశ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. క్రాస్ రోడ్డు వద్ద తెలంగాణ బీసీ ఇంటేలెక్చ్యువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య ప్రసంగించారు. ఆయనతో పాటు మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జస్టిస్ ఈశ్వరయ్య ప్రసంగించారు. ఎంతో కష్టపడి తాను బీసీల రిజర్వేషన్ల కోసం పూర్తి నివేదికను తయారు చేశానని చెప్పారు.
నేటికీ ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు దిశగా ఆలోచించడం లేదన్నారు. ఆరు నూరైనా సరే , అన్నీ కోల్పోయినా సరే బీసీలకు రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ ఆందోళన ఆగదని ప్రకటించారు. రిజర్వేషన్లు అమలు కోసం అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. కావాలని రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ లకు చట్ట సభలలో విద్యా, ఉద్యోగాలలో 42% చట్ట బద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ బీసీలు అత్యధికంగా ఉన్నా నేటికీ పదవుల పంపకంలో ఇంకా వివక్షకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






