స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హోం శాఖ మంత్రి
గుంటూరు జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ కామెంట్స్ చేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనలో గాయపడిన మృతుడు లక్ష్మీనాయుడు సోదరులు పవన్, భార్గవ్ లను గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీను, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు , సీనియర్ నేత నజీర్ తో కలిసి పరామర్శించారు. వారికి భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సందర్బంగా బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పూర్తి హామీ ఇచ్చారు. ఆందోళన చెంద వద్దని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల చొప్పున చెక్కులు అందచేసినట్లు తెలిపారు మంత్రి. బాధితులను పరామర్శించిన అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బాధితుల వైద్య ఖర్చులను మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చామన్నారు అనిత వంగలపూడి.






