సర్కార్ ను డిమాండ్ చేసిన తన్నీరు హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సర్కార్ పై. ఓ వైపు మక్క రైతులు మద్దతు ధర లభించక పోవడంతో మధ్య దళారీలకు అమ్ముకుంటున్నారని, పెద్ద ఎత్తున నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు ఉంచిన రైతులను పరామర్శించారు. ఈ సందర్బంగా అన్నదాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ. 2420 ఉండగా దళారులకు అమ్ముకోవడం వలన క్వింటాలుకు 500 రూపాయలు నష్టం కలుగుతోందన్నారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఎకరానికి రైతులకు రూ. 10 వేలు నష్టం వస్తోందని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి సంచులు మోసుడు తప్పా చేసింది ఏమున్నదంటూ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొన్నామని అన్నారు. కానీ ఇప్పుడు సకాలంలోనే మక్కలు చేతికి అందినా ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డకి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునుడే తప్ప రైతుల మీద పట్టింపు లేదని ధ్వజమెత్తారు హరీశ్ రావు. రెండు రైతు బంధులు ఇచ్చిండు మరో రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండంటూ ఎద్దేవా చేశారు. సగం రుణమాఫీ చేసిండు సగం రుణమాఫీ ఎగ్గొట్టిండు, కౌలు రైతులకు రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండేదని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 3 గంటల వరకే కరెంట్ ఇస్తున్నాడని ఆరోపించారు.






