సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కాంగ్రెస్ మంత్రులు కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడడం, రోడ్డుకు ఎక్కడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో రచ్చ రచ్చ చేశారని మండిపడ్డారు. ఏకంగా మంత్రి కూతురు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముళ్లు చేస్తున్న అక్రమాలు, భూ దందాల గురించి బయట పెట్టిందన్నారు. కనీసం సీఎంకు సోయి లేకుండా పోయిందన్నారు. దీంతో పాలన పడకేసిందన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ మోసాన్ని గమనించి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో తన సారథ్యంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు.
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పాలన, శాంతిభద్రతలు, ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సర్కార్ ప్రజలకు ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టులను నిలిపివేస్తూ, ప్రజలపై బుల్డోజర్లను ప్రయోగించిందని ఆయన ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పనితీరుకి పరీక్షగా నిలుస్తాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాటకాలను నమ్మకుండా, 420 గ్యారంటీల పేరుతో చేసిన మోసాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్ వచ్చిందని, పరిపాలన పరమైన సంపూర్ణ వైఫల్యం తెలంగాణలో కొనసాగుతున్నదని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు కేటీఆర్.






