సిడ్నీ వేదికగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
సిడ్నీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గ ధామం అని స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ర్యాలీ చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకమైన గూగుల్ కంపెనీ ఏఐ హబ్ ను విశాఖలో ఏర్పాటు చేసిందన్నారు. ఇదంతా సీఎం చంద్రబాబు చొరవ వల్లనే సాధ్యమైందని చెప్పారు. ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది డేటా సెంటర్ డెవలపర్లను కలిశానని, వారిని కూడా విశాఖలో వచ్చే నెల నవంబర్ 14, 15 తేదీలలో నిర్వహించే సీఐఐ సదస్సుకు రావాలని కోరుతున్నామన్నారు. ఇక ఎకో ప్రాజెక్టును 13 నెలల్లో పూర్తి చేశామన్నారు నారా లోకేష్. గూగుల్ తో అంగీకరించిన సమయం కంటే కేవలం ఒక నెల ఎక్కువ. ఏపీతో కలిసి పని చేయాలని ఒకసారి నిర్ణయించాక అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్ అని అన్నారు. మొదట ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేస్తాం. రోజూ సదరు ప్రాజెక్ట్ ల గురించి సమీక్షిస్తాం. ఇప్పుడు 25 వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయి. నా కార్యాలయం నుంచి అప్ డేట్స్ వెళ్తాయి. సంబంధిత మంత్రులు కూడా వాటిల్లో పాల్గొంటారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్రాజెక్ట్ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. రోజువారీ విధానంలో ప్రాజెక్ట్ ను సమీక్షిస్తాం అని చెప్పారు. అప్ డేట్ రాకపోతే నేనే స్వయంగా స్టేటస్ ను అడిగి తెలుసుకుంటానని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరో ఉదాహరణ ఆర్సెల్లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్. ఇండియాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ను విశాఖలో నిర్మిస్తున్నారని చెప్పారు నారా లోకేష్. ఈ ప్రాజెక్ట్ ను 15 నెలల్లో పూర్తి చేశామన్నారు. మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఇది గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. గత 16 నెలల్లో ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు నారా లోకేష్. ఇందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే కారణం అన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మేం చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు.






