ప్రజలకు ఇబ్బందులు తప్ప ఏం లేదు
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగానికి అనారోగ్యం ఏర్పడిందన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించారు. బస్తీలో ఉండే ప్రజలను సుస్తీ చేస్తే నయం చేసే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేశారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక వాటిని పట్టించు కోవడం లేదన్నారు. పేదలు ఎక్కువగా వీటికి వస్తారని అన్నారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగ కూడదని, తమ గడప దగ్గరనే, తమ వాకిట్లోనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్ట మొదటిసారిగా బస్తీ దవాఖానలను ప్రారంభించడం జరిగిందన్నారు హరీశ్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళం అన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల నుండి జీతం రావడం లేదు. స్టాఫ్ నర్స్ దేవమ్మకు ఐదు నెలల నుండి జీతం రాలేదని తెలిపిందన్నారు. సపోర్టింగ్ స్టాఫ్‌ని అడిగితే ఆరు నెలల నుంచి జీతం రాలేదన్నారు. బస్తీ దవాఖానలో పనిచేసే సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు పని ఎలా చేస్తారని ప్రశ్నించారు హరీశ్ రావు.






