అక్టోబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు
తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ వచ్చాక పేదలు, సామాన్యులకు శాపంగా మారిందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. వైద్యాన్ని అందకుండా చేయడంలో భాగంగానే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తెర లేపారంటూ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తన సారథ్యంలో పోస్టర్స్ ను విడుదల చేశారు. అక్టోబర్ 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని పేర్కొన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నామని తెలిపారు. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేపడతామని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ . కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తామన్నారు. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయన్నారు.






