ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
అమరావతి : మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన విడుదల చేశారు మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం ఉంటుందన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదిలిందన్నారు. ప్రస్తుతానికి చెన్నైకి 480కి.మీ, కాకినాడకి 530 కి.మీ., విశాఖపట్నంకి 560 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని జాగ్రత్త అని పేర్కొన్నారు. కాగా మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.
తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఇళ్ల వద్దే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని, చెట్లు, శిథిలాల భవనాల వద్ద ఉండ వద్దని సూచించారు ప్రఖర్ జైన్. ఇదిలా ఉండగా మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత హాజరయ్యారు. ఆస్తి-ప్రాణ నష్టం నుంచి రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తుఫాన్‌పై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ.






