ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి
అమరావతి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు.
మండలాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని 12 మండలాలపై ఉండనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. కాకినాడ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభావిత మండలాల పరిధిలో యంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలి. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలి. ముందుగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
ఇప్పటికే 260 పునరావాస కేంద్రాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లావ్యాప్తంగా గర్భిణి స్త్రీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. వారికి అవసరం అయిన పౌష్టికాహారం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన విషయాన్ని ప్రజలకు తెలియపర్చండి అని కోరారు.






