అప్రమత్తంగా ఉండాలని సూచన
అమరావతి : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం అత్యవస సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు సీఎం. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించ వద్దని సూచించారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో వైపు సర్కార్ ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఉమ్మడి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎక్కడా ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని, ఆహారం, నీళ్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు సీఎం.






