కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బ తిన్నాయని వాపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన వేలాది ఎకరాలు నీటి పాలయ్యాయని ఆవేదన చెందారు. 87 వేల హెక్టార్లకు పైగా పంటలు నాశనం అయ్యాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని మోడీ ఏపీ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండడం దారుణమన్నారు. రాష్ట్రంపై మాత్రం మళ్లీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ మండిపడ్డారు షర్మిలా రెడ్డి.
మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన ప్రధాని మౌనంగా ఉండడం క్షమించరాని నేరం అన్నారు. ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని పేర్కొన్నారు. 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు అని స్పష్టం చేశారు.






