బోరబండ రోడ్ షోలో మాజీ మంత్రి
హైదరాబాద్ : ఆరు నూరైనా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో రోడ్ షో చేపట్టారు.
ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలి పోయిందన్నారు. ఇక మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ తిరిగి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టలేదన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి రెండేళ్లైందని, ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు కేటీఆర్. స్కూటీలు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రూ. 4 వేల పెన్షన్ రాలేదు.. ఏ ఒక్క హామీ అమలు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తేనే 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, పేదల ఇళ్లు కూలగొట్టారని, మహిళలను నిట్ట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు కేటీఆర్. హైదరాబాద్‌ను నాశనం చేశారు. రియల్ ఎస్టేట్‌ను ధ్వంసం చేశారంటూ ధ్వజమెత్తారు. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న తెలంగాణను లాస్ట్ ప్లేస్‌కు దిగజార్చిన ఘనత సీఎంకు దక్కుతుందన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు రాకూడదంటే సునీతమ్మను గెలిపించాలని కోరారు. ప్రస్తుతం కారుకు బుల్డోజర్ కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేయాలన్నారు.






