హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి ప్రకటన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శాంతి, భద్రతలను కాపాడడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు అనిత వంగలపూడి. పోలీసుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటామని ప్రకటించారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. అలాంటి వారిపై పూర్తిగా ఫోకస్ పెడతామన్నారు. ఇకనైనా తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను పెట్టినా లేదా షేర్ చేసినా సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు వంగలపూడి అనిత. ఇక నుంచి సహించ బోమన్నారు. అంతే కాకుండా పోలీసులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో నూతనంగా నిర్మించిన డిఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు మంత్రి వంగలపూడి అనిత. ఇదిలా ఉండగా త్వరలోనే పోలీస్ శాఖలో 6,100 కొత్త పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.






