వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దీనిని కూడా వైసీపీ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో ఏమి జరుగుతోందో చూడకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఆయన స్థాయికి తగదన్నారు. అయినా వైసీపీ పార్టీ బాస్ కు నిరాధార ఆరోపణలు చేయడం తప్పితే తనకు ఏమీ రాదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించి హెక్టార్ కి 50,000 చొప్పున అంద చేయాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. 104 కోట్ల 57లక్షల రూపాయలు ఉల్లి రైతులకు లబ్ధి చేకూర్చామన్నారు.
ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు క్వింటాకు రూ.1200/- వెచ్చించి మార్కెటింగ్, మార్క్-ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్ లో సుమారు 17 కోట్ల 22 లక్షల రూపాయల విలువ గల ఉల్లి పంటను కొనుగోలు చేశామని చెప్పారు కింజరాపు అచ్చెన్నాయుడు. పంట పాడవ్వకుండా రైతులకు మేలు చేశామన్నారు. 2020లో వైసీపీ హయాంలో ఉల్లి ధర పడిపోతే మద్దతు ధర 770 రూపాయలు ప్రకటించడం తప్ప చేసిందేమి లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించి, రైతులకు కేవలం 75 లక్షలు మాత్రమే చెల్లించిన విషయం అవినాష్ రెడ్డి గుర్తించు కోవాలన్నారు.






